చంద్రబాబు అరెస్ట్ కేసీఆర్ కొంప ముంచుతుందా...?

Home >>> పాలిటిక్స్ > చంద్రబాబు అరెస్ట్ కేసీఆర్ కొంప ముంచుతుందా...?

news-details

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు సిఎం జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయా...? తెలంగాణాలో కూడా ఇది ప్రభావం చూపించే అవకాశాలు కనపడుతున్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చంద్రబాబుని అరెస్ట్ చేసి దాదాపు వారం రోజులు గడుస్తున్న నేపధ్యంలో  చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణాలో కూడా ధర్నాలు చేస్తున్న నేపధ్యంలో  ఇది ఏ మలుపు తిరుగుతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 

ఆంధ్రప్రదేశ్ సంగతి అలా ఉంచి తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే... ఐటి ఉద్యోగులు ధర్నాలు చేసిన తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లో స్తబ్దుగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ధర్నాలు చేసాయి. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగిన కార్ల ర్యాలి హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. అసలు ఈ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు అనేది పక్కన పెడితే... ఇది తెలంగాణాలో టీడీపీ, బిజెపి పొత్తుకి బాటలు వేస్తుంది అనే కామెంట్స్ వినపడుతున్నాయి. 

చంద్రబాబుని అరెస్ట్ చేసిన నాటి నుంచి కూడా... దీని వెనుక బిజెపి పెద్దలు ఉన్నారనే విమర్శలు టీడీపీ నేతల నుంచి వస్తున్నాయి. ఒకవేళ అదే నిజం అయితే గనుక... జగన్ తో చంద్రబాబుని అరెస్ట్ చేయించి... తెలంగాణాలో పెద్ద ఎత్తున చంద్రబాబుకి సపోర్ట్ గా ధర్నాలు చేయించడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని బిజెపి భావించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏపీలో కూడా ఇది తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ అనే చెప్పాలి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నాయకులు బయటకు రాకపోయినా టీడీపీ క్యాడర్ బయటకు వచ్చింది. అలాగే సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కారు. 

రాజకీయంగా ఇప్పుడు టీడీపీ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇది మంచి మైలేజ్ అనే చెప్పాలి. అదే విధంగా... జనసేనతో టీడీపీ కలిసి వెళ్ళడానికి కూడా ఈ పరిణామం బాటలు వేసింది. చంద్రబాబుని జైల్లో పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... వెంటనే పొత్తు కూడా ప్రకటించారు. దీనితో ఇది రాజకీయంగా కచ్చితంగా టీడీపీతో పాటుగా భవిష్యత్తులో కలిసి వెళ్లబోయే దాని మిత్రపక్షాలకు కూడా కలిసి వచ్చే అంశం అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా... తెలంగాణాలో కూడా ఇది సిఎం కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఐటి ఉద్యోగులు ధర్నాలతో బీఆర్ఎస్ అధిష్టానం ఆశ్చర్యపోయింది అనే చెప్పాలి. మరి ఈ అరెస్ట్ ఏ మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి.

You can share this post!