Home >>> పాలిటిక్స్ > తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్... మార్పులు.. చేర్పులు...!
ఎన్నికలు సమీపిస్తుండటంతో... తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు దృష్టి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలనేది తొలి నుంచి బీజేపీ ప్లాన్. అయితే కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 3 చోట్ల పోటీ చేసి... రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక కొత్త నేతల రాకతో తెలంగాణలో బలమైన శక్తిగా కూడా బీజేపీ ఎదిగిందనేది వాస్తవం. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీని సొంతం చేసుకోవాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన కాషాయ పెద్దలు... మరో పదవి కూడా ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అరవింద్ లేదా బాపూరావులకు మంత్రిపదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల లోపు కేంద్ర పెద్దలు తరచూ పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు.
అదే సమయంలో ఏపీలో కూడా బీజేపీ నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు అధికార వైసీపీకి అనుకూలంగా ఉందని కొందరు నేతలు బహిరంగగానే విమర్శించారు. అదే సమయంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను కలుపుకుంటూ వెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నాయనే మాట బహిరంగ రహస్యం. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపడం కష్టమనే భావన కేంద్ర పెద్దలది. దీంతో మంత్రివర్గ విస్తరణ సమయమే దీనికి ముహుర్తంగా భావిస్తున్నారు. కొత్త క్యాబినెట్‌లో ఏపీ ఎంపీ సీఎం రమేశ్‌కు ఛాన్స్ ఇవ్వాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజును తప్పించి... ఆయన స్థానంలో సత్యకుమార్‌ను నియమించనున్నట్లు సమాచారం.